RGV naa ishtam

కొందరి విషయంలో “తీవ్రత” అనివార్యం! ఇష్టపడడం, చిరాకుపడ్డం లాంటివి కుదరవు. అయితే ఆరాధించటం లేక పోతే అసహ్యించుకోవటం మాత్రమే వీలుపడతాయి. అలాంటి కోవకు చెందిన వ్యక్తి, “రాం గోపాల్ వర్మ” అని వేరే చెప్పక్కరలేదు. సినిమాలన్న, సినిమాలోని మనుషులన్నా నాకు ప్రత్యేక ఆసక్తి ఉండనందున, అమితంగా ఇష్టపడ్డానికో, విభేదించటానికి బద్దకించి, ఆ పేరు ఉన్న చిత్రాలను స్కిప్ చేస్తూ, ఆయన టీవీ లో వస్తే remote వాడుతూ, ఆయన బ్లాగును అనుసరించకుండా.. ఆర్జీవిని *హాయిగా* విస్మరించాను. మొన్నా అనుకోకుండా రక్త చరిత్ర పై మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా విని ఊరుకున్నాను. ఈ పుస్తకం గురించి తెల్సి, పెద్దగా పట్టించుకోలేదు. కాని, అనుకున్నది అనుకున్నట్టుగా, అదనపు అలంకారాలు లేకుండా మాట్లాడే వ్యక్తి రాసినా పుస్తకం, నచ్చకునా బానే ఉంటుందనిపించి చదివాను. అనుకున్నట్టే నిరాశ పడలేదు. పడినా, it’s worth it! అనిపించింది.
ఆర్జీవి గురించి తెలియకపోయినా, “నా ఇష్టం” అన్న టైటిల్, “అంకితం – నాకే!” అని రెండు ముక్కల్లో తానేంటో తేటతెల్లం చెయ్యడం వల్ల, “పోస్టర్ చూసి మోసపోయిన” బాపతు నిరాశలు కలిగే అవకాశం శూన్యం. “మనోడు.. తెలుగోడు..బొంబాయిని ఒక ఊపు ఊపుతున్నాడు” అని ప్రాతీయాభిమానంతో ఈ పుస్తకం చదివితే, దెబ్బ తినడం ఖాయం. “వీడు తీసిన సినిమాలు నాకు నచ్చాయి” అని చదివినా కష్టమే.
మధ్య తరగతి కుటుంబ పరిస్థితులకు తలవొగ్గి, ఇంజనీరింగ్ చేసి, ఒక ఉద్యోగం సంపాదించుకొని, ఏ విదేశాలకో పోయి, అక్కడ ఉండకలేక తిరిగొచ్చి, పెళ్ళిలో ఇమడలేక విడిపోయి.. పూట గడవడం కోసం మాత్రమే శ్రమించి, మిగితా సమయమంతా తన ఊహల్లో బతికేస్తూ, తోచినదల్లా మాట్లాడేస్తూ.. సమాజం standards లో failure కి నిలువెత్తు నిదర్శమనిపించే వాడిగా ఒకవేళ ఇతని జీవితం గడిచి ఉన్నా.. ఈ పుస్తకంలో అత్యధికభాగం అలానే ఉంటుంది అని నాకనిపించింది. సూపెర్ హిట్ అయిన శివ బదులు, పేపర్ మీద నిలచిపోయిన ఒక మాస్టర్ పీసు ఉండేది. సాక్షాత్తు శ్రీదేవి బదులు ఊహా శ్రీదేవి ఉండేది. సినిమా లో నిజ జీవిత విశ్లేషణలకు బదులుగా ఇంకేవో ఉండేవి. అంతే అని నాకనిపిస్తోంది. నాకు కలిగిన అనుభవాలు, నా పరిచయాలు, నేను చదివిన పుస్తకాల వల్ల నేను “నా”లా మిగిలాను అని చెప్పుకున్నారు గాని, ఈయనకు అయాన్ రాండ్ ను కాక, “పరుల కోసం బతుకు. నీ సంగతి మర్చిపో..” అని హితోపదేశాలు చేస్తుంటే కచ్చితంగా work out అయ్యేది కాదు!
(May be, it’s not always about man finding his influences or inspirations. It could be the other way round too. May be, Ayn Rand found him! Who knows? :P Well, let me take a break with my psychoanalysis here! :) )
పుస్తకాన్ని నాలుగు భాగాలుగా విభాజించొచ్చు. నాకు బాగా నచ్చింది.. మ్యూసింగ్స్ అనుకోకలిగే వ్యాసాలూ లాంటివి. ఆయన సినిమాల గురించి, ఆలోచనల గురించి, వ్యక్తుల గురించి ఆయన మాటల్లో చెప్పుకొస్తారు. కొన్ని “ఆహా” అనిపిస్తే, కొన్ని “ఓహ్” అనీ, మరికొన్ని “హహహ” అని, ఇంకొన్ని “అబ్బే!” అని అనిపిస్తాయి.
రెండో భాగంలో ఆయన గురించి ఇతరాలు ఏమనుకుంటారో తెలిపే అభిప్రాయాలు. నాకు కామెడి అనిపించిన సంగతి ఏంటంటే.. “ఎవడి లోకం వాడిది.. ఇందులో అన్యులకి ప్రవేశార్హత దొరకటమే దుర్లభం.. ఇక దాన్ని అర్థం చేసుకోవడం కూడానా?” అన్నట్టుగా ఒక వ్యాసం ముగిసీ ముగియగానే.. అన్యుల అభిప్రాయ పరంపర మొదలవుతుంది. రామూ అమ్మగారు, తనికెళ్ళ భరణి, రాముని అమితంగా ప్రభావితం చేసిన సత్యేంద్ర వ్యాసాలూ తక్క, మిగితావన్నీ ముత్యాల ముగ్గు సినిమాలో భజన బృందం బాపతులా అనిపించాయి. నన్ను విమర్శించేవాళ్ళంటే నాకిష్టం అని డంక బజాయించుకునే వీరు, ఏదో ఒక hate-mail కూడా చేర్చుంటే బాగుండేది.
ఆ తర్వాత, ప్రశ్నోత్తరాల రూపంలో వివిధ సందర్భాలు ఈయన వెలుబుచ్చిన అభిప్రాయాలు, విశ్వసించే నిజాలు ఉన్నాయి. సున్నిత మనస్కులు, ప్రపంచం అంటే ఒక రకమైన romanticism ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని చదువుకోవాల్సిన పేజీలు! చివరాఖరున కొన్ని అరుదైన ఫోటోలు. ఫోటోలూ బాగున్నాయి (కలర్ లో ఉంటే ఇంకా బాగుండేవి!), వాటి కింద లైన్లూ బాగున్నాయి.
ఈ పుస్తకంలో సాహిత్యపు విలువలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఇవి రచనలు కాదు, రాతలు! అని ముందే సుస్పష్టం చేసేసారు కాబట్టి, తెలుగు పుస్తకాల విషయంలో ఉండే షరా మామూలు complains వదిలేయచ్చు. అయినా, ఇంతటి విభిన్నమైన పుస్తకం తెలుగులో చదవటం నాకయితే ఆనందం కలిగించింది. “నేను తీసేవి అర్థం చేసుకోగలిగే వారు ఒక పది శాతమే.. తెలుగులో తీస్తే ఆ శాతం ఇంకా పడిపోతుంది కదా.. అందుకని తీయను” అని ఒక సారి ఆర్జీవి అన్న గుర్తు. పుస్తకానికి కూడా అదే లాజిక్ వాడకుండా, తెలుగులో రాసినందుకు ముదావహం. కొన్ని చోట్ల తెలుగు బాగా రాసారు. కాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే (కనీసం editors ! ) ఇంకా బాగుండేది.
సినిమా ప్రియులు మిస్ కాకూడని పుస్తకమే అనిపిస్తుంది. సినిమాలు అట్టే పట్టని నాలాంటి వాళ్ళకి కూడా.. ఇది విందు భోజనమే!
“అతడు” సినిమాలో తనికెళ్ళ భరణి డైలాగు ఒకటి ఉంటుంది.. “జింకను వేటాడేడప్పుడు పులి ఎంత ఓపిగ్గా ఉంటుంది. అట్టాంటిది పులినే యాటాడాలంటే ఇంకెంత ఓపిగ్గా ఉండాలి!” అని.
ఇప్పుడు రాము పులి, పుస్తకం చదవటం వేట అని కాదు నా ఉద్దేశ్యం. ఇక్కడ పులులు నిజాలు! నిజం నిష్టూరంగానే ఉంటుంది అంటారు. నిజం నిప్పు లాంటిది అని కూడా అంటారు. నిజానికి నిజం ఇంకా చాలా కూడా.. నిజం అసహ్యంగా ఉంటుంది. వికృతంగా ఉంటుంది. భయపెట్టేలా ఉంటుంది. మన అస్తిత్వాన్ని ప్రశ్నిన్చేలా  ఉంటుంది. మన ఆర్జీవి తానూ నమ్మిన నిజాలతోనే డీలింగ్ చేస్తుంటాడు. అందుకని, ఇది అందరి పుస్తకం కాలేదు! Be prepared for some severe jolts – this way or that way – before thinking of reading this book!
పుస్తకం లో కొన్ని హైలైట్ చేసుకోవాల్సిన లైన్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ ఇచ్చేస్తే, చదవబోయేవారి ఆనందానికి విఘాతం అని ఇవ్వటం లేదు. కాని తనికెళ్ళ భరణి గారి నాలుగు మాటలు ఇవ్వకుండా ఉండలేను.
రాం గోపాల్ వర్మ.. మాట మీద నిలబడని హరిశ్చంద్రుడు
రాం గోపాల్ వర్మ.. ఎంతో మందిని ప్రేమించిన రామచంద్రుడు
రాం గోపాల్ వర్మ.. చిత్రమైన చిత్రాల ఫ్యాక్టరీ
రాం గోపాల్ వర్మ.. ఎవడికీ అర్థం కాని ఒక మిస్టరీ
పుస్తకం వివరాలు:
నా ఇష్టం
రాం గోపాల్ వర్మ
ఏమ్మేస్కో ప్రచురణలు
వెల: 175
pages: 284